YouVersion Logo
Search Icon

మత్తయి 21:23-46

మత్తయి 21:23-46 TELUBSI

ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించుచుండగా ప్రధానయాజకులును ప్రజల పెద్దలును ఆయనయొద్దకు వచ్చి ఏ అధికారమువలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారమెవడు నీకిచ్చెనని అడుగగా – యేసు నేనును మిమ్ము నొక మాట అడుగుదును; అది మీరు నాతో చెప్పినయెడల, నేనును ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడనుండి కలిగినది? పరలోకమునుండి కలిగినదా, మనుష్యులనుండి కలిగినదా? అని వారినడిగెను. వారు–మనము పరలోకము నుండి అని చెప్పితిమా, ఆయన–ఆలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనలనడుగును; మనుష్యులవలననని చెప్పితిమా, జనులకు భయపడుచున్నాము; అందరు యోహానును ప్రవక్త అని యెంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని–మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి అందుకాయన ఏ అధికారమువలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అదియు మీతో చెప్పను. మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. అతడు మొదటివానియొద్దకు వచ్చి కుమారుడా, నేడు పోయి ద్రాక్షతోటలో పని చేయుమని చెప్పగా వాడు పోను అని యుత్తరమిచ్చెను గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అతడు రెండవవానియొద్దకు వచ్చి ఆప్రకారమే చెప్పగా వాడు అయ్యా, పోదుననెను గాని పోలేదు. ఈ యిద్దరిలో ఎవడు తండ్రి యిష్టప్రకారము చేసినవాడని వారి నడిగెను. అందుకు వారు–మొదటివాడే అనిరి. యేసు సుంకరులును వేశ్యలును మీకంటె ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీయొద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు; అయితే సుంకరులును వేశ్య లును అతనిని నమ్మిరి; మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపపడక పోతిరి. మరియొక ఉపమానము వినుడి. ఇంటి యజమాను డొకడుండెను. అతడు ద్రాక్షతోట నాటించి, దాని చుట్టు కంచె వేయించి, అందులో ద్రాక్షలతొట్టి తొలి పించి, గోపురముకట్టించి, కాపులకు దాని గుత్తకిచ్చి, దేశాంతరము పోయెను. పండ్లకాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసికొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులనంపగా ఆ కాపులు అతని దాసు లను పట్టుకొని, యొకని కొట్టిరి యొకని చంపిరి, మరి యొకనిమీద రాళ్లు రువ్విరి. మరల అతడుమునుపటి కంటె ఎక్కువమంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వార సుడు; ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసికొందము రండని తమలోతాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్షతోట వెలుపట పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయుననెను. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి, వాటివాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతరకాపులకు ఆ ద్రాక్షతోట గుత్త కిచ్చునని ఆయనతో చెప్పిరి. మరియు యేసు వారిని చూచి –ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువు వలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడును చదువ లేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతిమీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవనిమీద పడునో వానిని నలిచేయుననెను. ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన చెప్పిన ఉపమానములను విని, తమ్మునుగూర్చియే చెప్పెనని గ్రహించి ఆయనను పట్టుకొన సమయము చూచుచుండిరి గాని జనులందరు ఆయనను ప్రవక్తయని యెంచిరి గనుక వారికి భయపడిరి.

Video for మత్తయి 21:23-46

Free Reading Plans and Devotionals related to మత్తయి 21:23-46