YouVersion Logo
Search Icon

లూకా 7:1-6, 8-35

లూకా 7:1-6 TELUBSI

ఆయన తన మాటలన్నియు ప్రజలకు సంపూర్తిగా విని పించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగియై చావ సిద్ధమైయుండెను. శతాధిపతి యేసునుగూర్చి విని, ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి–నీవలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు; అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజమందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. కావున యేసు వారితోకూడ వెళ్లెను. ఆయన ఆ యింటిదగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి–మీ రాయనయొద్దకు వెళ్లిప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు; నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను.

లూకా 7:8-35 TELUBSI

నేను సహా అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రిందను సైనికులు ఉన్నారు; నేనొకని పొమ్మంటె పోవును, ఒకని రమ్మంటె వచ్చును, నాదాసుని చేయుమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. యేసు ఈ మాటలు విని, అతనిగూర్చి ఆశ్చర్యపడి, తనవెంట వచ్చుచున్న జనసమూహమువైపు తిరిగి–ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాననెను. పంపబడినవారు ఇంటికి తిరిగివచ్చి, ఆ దాసుడు స్వస్థుడైయుండుట కనుగొనిరి. వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్లుచుండగా, ఆయన శిష్యులును బహుజనసమూహమును ఆయనతోకూడ వెళ్లుచుండిరి. ఆయన ఆ ఊరి గవినియొద్దకు వచ్చి నప్పుడు, చనిపోయిన యొకడు వెలుపలికి మోసికొని పోబడుచుండెను; అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు; ఆ ఊరి జనులు అనేకులు ఆమెతోకూడ ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమెయందు కనికరపడి–ఏడువవద్దని ఆమెతో చెప్పి, దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన –చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయినవాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను; ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. అందరు భయాక్రాంతులై–మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి యున్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమను గ్రహించియున్నాడనియు దేవుని మహిమపరచిరి. ఆయననుగూర్చిన యీ సమాచారము యూదయ యందంతటను చుట్టుపెట్ల ప్రదేశమందంతటను వ్యాపించెను. యోహాను శిష్యులు ఈ సంగతులన్నియు అతనికి తెలియజేసిరి. అంతట యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి–రాబోవువాడవు నీవేనా? మేము మరియొకని కొరకు కనిపెట్టవలెనా? అని అడుగుటకు వారిని ప్రభువు నొద్దకు పంపెను. ఆ మనుష్యులు ఆయనయొద్దకు వచ్చి –రాబోవువాడవు నీవేనా? లేక మరియొకనికొరకు మేము కనిపెట్టవలెనా? అని అడుగుటకు బాప్తిస్మమిచ్చు యోహాను మమ్మును నీయొద్దకు పంపెనని చెప్పిరి. ఆ గడియలోనే ఆయన రోగములును, బాధలును, అపవిత్రాత్మలునుగల అనేకులను స్వస్థపరచి, చాలమంది గ్రుడ్డివారికి చూపు దయ చేసెను. అప్పుడాయన–మీరు వెళ్లి, కన్నవాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపుపొందు చున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రక టింపబడుచున్నది; నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చెను. యోహాను దూతలు వెళ్లిన తరువాత, ఆయన యోహా నునుగూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగెను–మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్లితిరి? గాలికి కదలుచున్న రెల్లునా? మరేమి చూడ వెళ్లితిరి? సన్నపు బట్టలు ధరించుకొనిన వానినా? ఇదిగో ప్రశస్తవస్త్రములు ధరించుకొని, సుఖముగా జీవించువారు రాజగృహములలో ఉందురు. అయితే మరేమి చూడవెళ్లితిరి? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్తకంటె గొప్పవానినని మీతో చెప్పు చున్నాను. –ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపు చున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని యెవరినిగూర్చి వ్రాయబడెనో అతడే యీ యోహాను. స్ర్తీలు కనినవారిలో యోహానుకంటె గొప్పవాడెవడును లేడు. అయినను దేవుని రాజ్యములో అల్పుడైనవాడు అతనికంటె గొప్పవాడని మీతో చెప్పు చున్నాను. ప్రజలందరును సుంకరులును (యోహాను బోధ) విని, అతడిచ్చిన బాప్తిస్మము పొందినవారై, దేవుడు న్యాయవంతుడని యొప్పుకొనిరి గాని పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులును అతనిచేత బాప్తిస్మము పొందక, తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. కాబట్టి యీ తరము మనుష్యులను నేను దేనితో పోల్చు దును, వారు దేనిని పోలియున్నారు? సంతవీధులలో కూర్చుండియుండి–మీకు పిల్లనగ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితిమి గాని మీరేడ్వ రైతిరి అని యొకనితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలియున్నారు. బాప్తిస్మ మిచ్చు యోహాను, రొట్టె తినకయు ద్రాక్షారసము త్రాగకయు వచ్చెను గనుక–వీడు దయ్యముపెట్టినవాడని మీ రనుచున్నారు. మనుష్యకుమారుడు తినుచును, త్రాగుచును వచ్చెను గనుక మీరు–ఇదిగో వీడు తిండిపోతును మద్యపానియు, సుంకరులకును పాపులకును స్నేహితు డును అనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరినిబట్టి తీర్పుపొందుననెను.

Free Reading Plans and Devotionals related to లూకా 7:1-6, 8-35