యిర్మీయా 20
20
1యిర్మీయా ఆ ప్రవచనములను పలుకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పషూరను యాజకుడు విని 2ప్రవక్తయైన యిర్మీయాను కొట్టి, యెహోవామందిరమందున్న బెన్యామీనుమీది గుమ్మమునొద్దనుండు బొండలో అతనిని వేయించెను. 3మరునాడు పషూరు యిర్మీయాను బొండలోనుండి విడిపింపగా యిర్మీయా అతనితో ఇట్లనెను–యెహోవా నీకు పషూరను పేరు పెట్టడు గాని మాగోర్మిస్సాబీబ్#20:3 అనగా–నలుదిక్కుల భయము కలుగజేసెడివాడు. అని నీకు పేరు పెట్టును. 4యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–నీకును నీ స్నేహితులకందరికిని నీవే భయ కారణముగా నుండునట్లు చేయుచున్నాను; నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గముచేత కూలెదరు, మరియు యూదావారినందరిని బబులోను రాజుచేతికి అప్పగింతును, అతడు వారిని చెరపెట్టి బబులోనునకు తీసికొనిపోవును, ఖడ్గముచేత వారిని హతముచేయును. 5ఈ పట్టణములోని ఐశ్వర్యమంతయు దానికి వచ్చిన లాభ మంతయు దాని అమూల్యవస్తువులన్నియు యూదారాజుల నిధులన్నియు నేనప్పగింతును, వారి శత్రువుల చేతికే వాటి నప్పగింతును, శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులోనునకు తీసికొనిపోవుదురు. 6పషూరూ, నీవును నీ యింట నివసించువారందరును చెరలోనికి పోవుదురు, నీవును నీవు ప్రవచనములచేత మోసపుచ్చిన నీ స్నేహితులందరును బబులోనునకు వచ్చెదరు, అక్కడనే చనిపోయెదరు అక్కడనే పాతిపెట్టబడెదరు.
7యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని; నీవు బలవంతముచేసి నన్ను గెలిచితివి, నేను దినమెల్ల నవ్వులపాలైతిని, అందరు నన్ను ఎగతాళి చేయుదురు. 8ఏలయనగా నేను పలుకునప్పుడెల్ల బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని యెలుగెత్తి చాటింపవలసి వచ్చెను; దినమెల్ల యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను. 9ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమునుబట్టి ప్రకటింపను, అని నేననుకొంటినా? అది నా హృదయములో అగ్నివలె మండుచు నా యెముకలలోనే మూయబడియున్నట్లున్నది; నేను ఓర్చి యోర్చి విసికి యున్నాను, చెప్పక మానలేదు. 10నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు–దుర్మార్గు డని మీరు చాటించినయెడల మేమును చాటింతుమందురు; అతడొకవేళ చిక్కుపడును, అప్పుడు మనమతని పట్టుకొని అతనిమీద పగతీర్చుకొందమని చెప్పుకొనుచు, నాకు స్నేహితులైన వారందరు నేను పడిపోగా చూడవలెనని కనిపెట్టుకొనియున్నారు. 11అయితే పరాక్రమముగల శూరునివలె యెహోవా నాకు తోడైయున్నాడు; నన్ను హింసించువారు నన్ను గెలువక తొట్రిల్లుదురు; వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు, వారెన్నడును మరువబడని నిత్యావమానము పొందుదురు. 12సైన్యములకధిపతివగు యెహోవా, నీతిమంతులను పరిశో ధించువాడవు నీవే; అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే; నా వ్యాజ్యెమును నీకే అప్పగించుచున్నాను. నీవు వారికిచేయు ప్రతి దండన నేను చూతును గాక 13యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతిలోనుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు.
14నేను పుట్టినదినము శపింపబడును గాక; నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండును గాక; 15–నీకు మగపిల్ల పుట్టెనని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించినవాడు శాపగ్రస్తు డగును గాక; 16నా తల్లి నాకు సమాధిగానుండి ఆమె ఎల్లప్పుడు గర్భవతిగానుండునట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక 17యెహోవా యేమాత్రమును సంతాపములేక నశింపజేసిన పట్టణములవలె ఆ మనుష్యుడు ఉండును గాక; ఉదయమున ఆర్తధ్వనిని మధ్యాహ్న కాలమందు యుద్ధధ్వనిని అతడు వినును గాక 18కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గతించిపోవునట్లు నేనేల గర్భములోనుండి వెడలితిని?
Currently Selected:
యిర్మీయా 20: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.