అప్పుడు ఉత్తరం వైపు నుండి ఒక తుఫాను వస్తుండడం చూశాను. ఒక మహా మేఘం, దానిలో ప్రజ్వలించే అగ్ని కనిపించాయి. ఆ మేఘంలో గొప్ప కాంతి కనిపించింది. ఆ కాంతి దాన్ని ఆవరించి ఉంది. ఆ మేఘంలో మండే అగ్ని మెరుగు పెట్టిన కంచులా ఉంది. దాని మధ్యలో నాలుగు జీవుల్లాంటి ఒక స్వరూపం కనిపించింది. అవి మానవ రూపంలో ఉన్నాయి. ఒక్కో దానికి నాలుగు ముఖాలు ఉన్నాయి. అలాగే నాలుగు రెక్కలు ఉన్నాయి.
వాటి కాళ్లు తిన్నగా ఉన్నాయి. వాటి అరికాళ్ళు దూడ డెక్కల్లా ఉన్నాయి. అవి మెరుగు పెట్టిన ఇత్తడిలా మెరుస్తూ ఉన్నాయి. అయినా మనుషులకున్నట్టే వాటికి చేతులు ఉన్నాయి. అవి వాటి నాలుగు రెక్కల కింద ఉన్నాయి. నాలుగు జీవుల ముఖాలూ, రెక్కలూ ఇలా ఉన్నాయి. వాటి రెక్కలు పక్కనే ఉన్న మరో జీవి రెక్కలను తాకుతూ ఉన్నాయి. అవి వెళ్తున్నప్పుడు ఏ వైపుకీ తిరగడం లేదు. అవన్నీ ముందుకే ప్రయాణం చేస్తూ ఉన్నాయి.