జెకర్యా 8

8
యెరూషలేమును ఆశీర్వదిస్తానని యెహోవా వాగ్దానం
1సైన్యాల యెహోవా వాక్కు నాకు వచ్చింది.
2సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “నేను సీయోను గురించి చాలా ఆసక్తి కలిగి ఉన్నాను; ఆమె పట్ల ఉన్న ఆసక్తి నన్ను దహించివేస్తుంది.”
3యెహోవా చెప్పే మాట ఇదే: “నేను సీయోనుకు తిరిగివచ్చి యెరూషలేములో నివసిస్తాను. అప్పుడు యెరూషలేము నమ్మకమైన పట్టణమని, సైన్యాల యెహోవా పర్వతమని, పవిత్ర పర్వతమని పిలువబడుతుంది.”
4సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “మరోసారి వృద్ధులైన స్త్రీ పురుషులు తమ చేతికర్ర పట్టుకొని ఇంకా యెరూషలేము వీధుల్లో కూర్చుంటారు. 5పట్టణ వీధులు ఆటలాడే అబ్బాయిలతో అమ్మాయిలతో నిండిపోతాయి.”
6సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “ఆ సమయంలో ఈ ప్రజల్లో మిగిలిన ఉన్నవారికి ఇది ఆశ్చర్యకరంగా ఉండవచ్చు కాని నాకు ఆశ్చర్యంగా ఉంటుందా?” అని సైన్యాల యెహోవా అంటున్నారు.
7సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “నేను తూర్పు, పడమర దేశాల నుండి నా ప్రజలను రక్షిస్తాను. 8యెరూషలేములో నివసించేందుకు వారిని తిరిగి తీసుకువస్తాను; వారు నా ప్రజలుగా ఉంటారు, నేను వారికి దేవునిగా నమ్మకంగా నీతితో ఉంటాను.”
9సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “ఇప్పుడు ఈ మాటలు వినండి, ‘మందిరాన్ని కట్టడానికి మీ చేతులను బలపరచుకోండి.’ సైన్యాల యెహోవా మందిర పునాది వేసినప్పుడు ఉన్న ప్రవక్తలు చెప్పింది ఇదే. 10అంతకుముందు మనుష్యులకు జీతం గాని, పశువులకు బాడిగ గాని దొరకలేదు. నేను ఒకరిపై ఒకరికి వ్యతిరేకత కలిగించాను కాబట్టి ఎవరూ క్షేమంగా తమ పనిని చేయలేకపోయారు. 11అయితే పూర్వకాలంలో నేను చేసినట్లుగా ఇప్పుడు మిగిలి ఉన్నవారిపట్ల చేయను” అని సైన్యాల యెహోవా అంటున్నారు.
12“సమాధానమనే విత్తనం చక్కగా మొలకెత్తుతుంది, ద్రాక్షచెట్టు తన ఫలాన్ని ఇస్తుంది, భూమి తన పంటను ఇస్తుంది, ఆకాశం మంచు కురిపిస్తుంది. ఈ ప్రజల్లో మిగిలి ఉన్నవారికి వీటన్నిటిని వారసత్వంగా ఇస్తాను. 13యూదా, ఇశ్రాయేలూ, మీరు ఇతర ప్రజల్లో ఎలా శాపానికి గురై ఉన్నారో అలాగే మీరు దీవెనకరంగా ఉండేలా నేను మిమ్మల్ని రక్షిస్తాను. మీరు దీవెనకరంగా ఉంటారు. భయపడకండి, మీ చేతులు బలం కలిగి ఉండనివ్వండి.”
14సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “మీ పూర్వికులు నాకు కోపం పుట్టించినప్పుడు దయ చూపించకుండ నేను మీకు కీడు చేయాలని అనుకున్నట్టే” అని సైన్యాల యెహోవా అంటున్నారు, 15“ఇప్పుడు నేను యెరూషలేము యూదాలకు మేలు చేయాలని నిశ్చయించుకున్నాను. భయపడకండి. 16మీరు చేయవలసిన పనులేవంటే: ఒకరితో ఒకరు సత్యమే మాట్లాడాలి, మీ న్యాయస్థానాల్లో సమాధానకరమైన తీర్పు ఇవ్వాలి; 17ఒకరిపై ఒకరు కుట్ర చేయకూడదు, అబద్ధ ప్రమాణం చేయడానికి ఇష్టపడవద్దు. ఇవన్నీ నేను ద్వేషిస్తాను” అని యెహోవా చెప్తున్నారు.
18సైన్యాల యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది.
19సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “నాలుగు, అయిదు, ఏడు పదవ నెలల్లో మీరు చేసే ఉపవాసాలు యూదా వారికి ఆనందాన్ని ఉల్లాసాన్ని కలిగించే సంతోషకరమైన పండుగలుగా మారుతాయి. కాబట్టి సత్యాన్ని సమాధానాన్ని ప్రేమించండి.”
20సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “అనేకమంది ప్రజలు ఎన్నో పట్టణాల నివాసులు ఇంకా వస్తారు, 21ఒక పట్టణం వారు మరో పట్టణం వారి దగ్గరకు వెళ్లి, ‘సైన్యాల యెహోవాను వెదకి, యెహోవాను వేడుకోడానికి వెంటనే వెళ్దాం రండి’ అని చెప్పగా వారు, ‘మేము కూడా వస్తాం’ అని అంటారు. 22అన్నిటిని పరిపాలించే సైన్యాల యెహోవాను వెదకడానికి, ఆయన దయను కోరడానికి అనేకమంది ప్రజలు, శక్తివంతమైన దేశాలు యెరూషలేముకు వస్తారు.”
23సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “ఆ రోజుల్లో, ఇతర ప్రజల్లో ఆయా భాషల్లో మాట్లాడే పదిమంది ఒక యూదుని చెంగు పట్టుకుని, ‘దేవుడు మీకు తోడుగా ఉన్నారని మేము విన్నాము. మేము కూడా మీతో వస్తాం’ అంటారు.”

المحددات الحالية:

జెకర్యా 8: TSA

تمييز النص

شارك

نسخ

None

هل تريد حفظ أبرز أعمالك على جميع أجهزتك؟ قم بالتسجيل أو تسجيل الدخول