జెకర్యా 7
7
ఉపవాసం కన్నా న్యాయం కనికరం మేలు
1రాజైన దర్యావేషు పరిపాలన నాలుగవ సంవత్సరం కిస్లేవు అనే తొమ్మిదవ నెల నాలుగో రోజున యెహోవా వాక్కు జెకర్యా దగ్గరకు వచ్చింది. 2బేతేలు ప్రజలు యెహోవాను వేడుకోడానికి షెరెజెరును రెగెమ్మెలెకును తమ మనుష్యులతో పాటు పంపి, 3“అనేక సంవత్సరాలుగా మేము చేస్తున్నట్లుగా అయిదవ నెలలో దుఃఖిస్తూ ఉపవాసం ఉండాలా?” అని సైన్యాల యెహోవా మందిరంలోని యాజకులను, ప్రవక్తలను అడిగారు.
4అప్పుడు సైన్యాల యెహోవా వాక్కు నాకు వచ్చి: 5“దేశ ప్రజలందరినీ, యాజకులను ఇలా అడుగు, ‘మీరు గత డెబ్బై సంవత్సరాలుగా అయిదవ నెలలో, ఏడవ నెలలో ఉపవాసం ఉండి దుఃఖించినప్పుడు, మీరు నిజంగా నా కోసం ఉపవాసం ఉన్నారా? 6మీరు తినేటప్పుడు త్రాగేటప్పుడు కేవలం మీ కోసం మాత్రమే విందు చేసుకోలేదా? 7యెరూషలేము, దాని ప్రక్కన ఉన్న పట్టణాలన్ని విశ్రాంతిగా క్షేమంగా ఉన్నప్పుడు, దక్షిణ ప్రదేశం, పడమటి మైదానాల్లో ప్రజలు విస్తరించి ఉన్నప్పుడు పూర్వకాలపు ప్రవక్తల ద్వారా యెహోవా ఈ మాటలను ప్రకటించలేదా?’ ”
8మరోసారి యెహోవా వాక్కు జెకర్యాకు వచ్చి: 9“సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘సత్యంతో న్యాయం తీర్చండి; ఒకరిపట్ల ఒకరు కనికరం, దయ కలిగి ఉండండి. 10విధవరాండ్రను తండ్రిలేనివారిని విదేశీయులను బీదలను హింసించకండి. ఒకరి మీద ఒకరు కుట్ర చేయకండి’ అని చెప్పింది.
11“కానీ వారు నిర్లక్ష్యం చేసి మొండిగా వెనుదిరిగి తమ చెవులను మూసుకున్నారు. 12తమ హృదయాలను చెకుముకి రాయిలా గట్టిగా చేసుకున్నారు, సైన్యాల యెహోవా తన ఆత్మ ద్వారా పూర్వ ప్రవక్తలకు ఇచ్చిన ఉపదేశాన్ని, మాటలను వినలేదు. కాబట్టి సైన్యాల యెహోవా చాలా కోప్పడ్డారు.
13“ ‘నేను పిలిచినప్పుడు, వారు వినలేదు; కాబట్టి వారు పిలిచినప్పుడు నేను వినను’ అని సైన్యాల యెహోవా చెప్తున్నారు. 14‘వారికి తెలియని ఇతర దేశ ప్రజల మధ్యలోని నేను వారిని సుడిగాలిలా చెదరగొట్టాను. వారు వదిలి వెళ్లిన దేశం గుండా ఎవరూ ప్రయాణించలేనంతగా అది పాడైపోయింది. ఇలా మనోహరమైన తమ దేశాన్ని వారు పాడుచేశారు.’ ”
المحددات الحالية:
జెకర్యా 7: TSA
تمييز النص
شارك
نسخ

هل تريد حفظ أبرز أعمالك على جميع أجهزتك؟ قم بالتسجيل أو تسجيل الدخول
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.