የYouVersion አርማ
የፍለጋ አዶ

ఆది 17

17
సున్నతి నిబంధన
1అబ్రాముకు తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, “నేను సర్వశక్తిగల#17:1 హెబ్రీ ఎల్-షద్దాయ్ దేవుడను, నా ఎదుట నీవు నమ్మకంగా నిందారహితునిగా జీవించాలి. 2అప్పుడు నేను నీకు నాకు మధ్య నిబంధన చేస్తాను, నీ సంతతిని అత్యధికంగా వర్ధిల్లజేస్తాను” అన్నారు.
3అబ్రాము సాష్టాంగపడ్డాడు, అప్పుడు దేవుడు అతనితో ఇలా అన్నారు, 4“నేను నీతో చేస్తున్న నిబంధన ఇదే: నీవు అనేక జనాంగాలకు తండ్రివవుతావు. 5ఇకమీదట నీ పేరు అబ్రాము#17:5 అబ్రాము అంటే హెచ్చింపబడ్డ తండ్రి కాదు; నీకు అబ్రాహాము#17:5 అబ్రాహాము బహుశ అనేకులకు తండ్రి అని పేరు పెడుతున్నాను ఎందుకంటే నేను నిన్ను అనేక జనాలకు తండ్రిగా చేశాను. 6నిన్ను ఎంతో ఫలభరితంగా చేస్తాను; నిన్ను అనేక జనాంగాలుగా చేస్తాను, రాజులు నీ నుండి వస్తారు. 7నా నిబంధనను నాకు నీకు మరి నీ తర్వాత వచ్చు నీ వారసులకు మధ్య నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను, నీకు దేవునిగా, నీ తర్వాత నీ వారసులకు దేవునిగా ఉంటాను. 8నీవు పరదేశిగా ఉంటున్న కనాను దేశమంతా నీకు, నీ తర్వాత నీ వారసులకు నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను; వారికి నేను దేవునిగా ఉంటాను.”
9అప్పుడు దేవుడు అబ్రాహాముతో ఇలా అన్నారు, “నీవైతే, నీవు, నీ తర్వాత నీ సంతానం తరతరాల వరకు నా నిబంధనను నిలుపుకోవాలి. 10నీకు నీ తర్వాత నీ సంతతివారికి నేను చేసే నా నిబంధన, మీరు నిలుపుకోవలసిన నిబంధన ఇదే: మీలో ప్రతి మగవాడు సున్నతి చేసుకోవాలి. 11మీకు నాకు మధ్య నిబంధన గుర్తుగా మీ గోప్య చర్మాన్ని సున్నతి చేసుకోవాలి. 12రాబోయే తరాలలో ఎనిమిది రోజుల వయస్సున్న ప్రతి మగబిడ్డకు అంటే మీ ఇంట్లో పుట్టినవారైనా మీ సంతతి కాక విదేశీయుల నుండి కొనబడినవారైనా సున్నతి చేయబడాలి. 13మీ డబ్బుతో కొనబడినవారైనా, వారికి సున్నతి చేయబడాలి. మీ శరీరంలో నా నిబంధన నిత్య నిబంధనగా ఉండాలి. 14సున్నతి చేయబడని మగవారు అంటే తన గోప్య చర్మానికి సున్నతి చేయబడనివారు తమ జనులలో నుండి బహిష్కరించబడాలి; ఎందుకంటే వారు నా నిబంధనను మీరారు.”
15దేవుడు అబ్రాహాముతో ఇలా కూడా చెప్పారు, “నీ భార్యయైన శారాయిని ఇకపై శారాయి అని పిలువకూడదు; ఇప్పటినుండి తన పేరు శారా. 16నేను ఖచ్చితంగా ఆమెను ఆశీర్వదిస్తాను, ఆమె ద్వార నీకు కుమారున్ని ఇస్తాను. ఆమె జనాంగాలకు తల్లిగా ఉండేలా తనను ఆశీర్వదిస్తాను; అనేక జనాంగాల రాజులు ఆమె నుండి వస్తారు.”
17అప్పుడు అబ్రాహాము సాష్టాంగపడ్డాడు; అతడు తన హృదయంలో నవ్వుకుంటూ, “నూరు సంవత్సరాలు నిండిన మనుష్యునికి కుమారుడు పుడతాడా? తొంభై సంవత్సరాలు నిండిన శారా బిడ్డను కంటుందా?” అని అనుకున్నాడు. 18అబ్రాహాము దేవునితో, “మీ ఆశీర్వాదం క్రింద ఇష్మాయేలు జీవిస్తే చాలు!” అని అన్నాడు.
19అప్పుడు దేవుడు, “అవును, అయితే నీ భార్య శారా ఒక కుమారునికి జన్మనిస్తుంది, అతనికి ఇస్సాకు#17:19 ఇస్సాకు అంటే అతడు నవ్వుతాడు అని పేరు పెడతావు. అతనితో నా నిబంధనను చేస్తాను, తన తర్వాత తన సంతానంతో ఉండేలా నిత్య నిబంధనగా దానిని స్థిరపరుస్తాను. 20ఇష్మాయేలు గురించి, నీవు అడిగింది విన్నాను: నేను అతన్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను; అతడు ఫలించి విస్తరించేలా చేస్తాను, సంఖ్యాపరంగా గొప్పగా విస్తరింపజేస్తాను. అతడు పన్నెండుమంది పాలకులకు తండ్రిగా ఉంటాడు; అతన్ని గొప్ప జనంగా చేస్తాను. 21అయితే వచ్చే యేడాది ఈ సమయానికి శారా నీకోసం కనే ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరుస్తాను” అని చెప్పారు. 22దేవుడు అబ్రాహాముతో మాట్లాడిన తర్వాత, పైకి వెళ్లిపోయారు.
23ఆ రోజే అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయేలును, ఇంట్లో పుట్టిన లేదా డబ్బుతో కొనబడిన మగవారికందరికి దేవుడు చెప్పినట్టు సున్నతి చేయించాడు. 24అబ్రాహాము సున్నతి పొందినప్పుడు అతని వయస్సు తొంభై తొమ్మిది సంవత్సరాలు, 25తన కుమారుడైన ఇష్మాయేలు వయస్సు పదమూడు సంవత్సరాలు; 26అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయేలు, ఇద్దరు అదే రోజు సున్నతి పొందారు. 27అబ్రాహాము ఇంటివారిలో మగవారందరు, అతని ఇంట్లో పుట్టిన వారు లేదా విదేశీయుల నుండి కొనబడిన అతనితో పాటు సున్నతి చేయించుకున్నారు.

Currently Selected:

ఆది 17: TSA

ማድመቅ

Share

Copy

None

ያደመቋቸው ምንባቦች በሁሉም መሣሪያዎችዎ ላይ እንዲቀመጡ ይፈልጋሉ? ይመዝገቡ ወይም ይግቡ